విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి


మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలో గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసి, టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేలా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పేదవారి పిల్లలు కూడా ధనికులతో సమానంగా విద్య పొందేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రూ.1 కోటి వ్యయంతో ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు అప్రోచ్ బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇటీవల రూ.2.70 కోట్లతో బాలికల వసతి గృహం ప్రారంభించామని పేర్కొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వివరించారు.

విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్లతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిషియన్, మెకానిక్ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.

వైద్య రంగంలో కూడా పేదలకు నాణ్యమైన సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువు ఆపకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల వ్యాఖ్యలు

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గిరిజనులకు అదనంగా ఇళ్ల కేటాయింపు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి పోషకాహారం అందిస్తున్నామని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అధికారుల అభిప్రాయాలు

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్లాసులు నిర్వహించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ఎస్పీ రోహిత్ రాజు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ విద్యాసంస్థలో 584 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, కొత్త డార్మెటరీ ద్వారా 600 మందికి వసతి కల్పించే అవకాశం ఉందన్నారు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూనెం రమేష్, ప్రిన్సిపాల్ రాణి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.