రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో “అరైవ్ – అ లైవ్” కార్యక్రమాన్ని పురస్కరించుకుని, బుధవారం పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా ప్రారంభించారు.
“రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందితే భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, కార్లలో ప్రయాణించే సమయంలో సీట్‌బెల్ట్ వినియోగంపై గుర్తు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రహదారి నియమాల పాటింపు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధురవాణి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, కోఆర్డినేటర్ నాగశేఖర శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment