శారీరక సంబంధం కోసం దారుణం… భర్తను హత్య చేయించిన భార్య
హన్మకొండ జిల్లా పరకాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తున్నాడనే కారణంతో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఆధారాలు దొరక్కుండా మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టడం ఈ ఘటనను మరింత భయానకంగా మార్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, పరకాలకు చెందిన సుమన్ ఓ రెస్టారెంట్‌లో పని చేసేవాడు. అతనికి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లావణ్యకు కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సుమన్, భార్యను పలుమార్లు ప్రశ్నించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి.
ఇక భర్తను శాశ్వతంగా తొలగించాలనే ఉద్దేశంతో లావణ్య తన ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. ఇందుకోసం ఒక సుఫారీ గ్యాంగ్‌ను సంప్రదించి, భర్తను చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాన్ ప్రకారం, కొద్దిరోజుల ముందే లావణ్య తన పుట్టింటికి వెళ్లింది.
ఈ నెల 3వ తేదీ నుంచి సుమన్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భార్య ప్రవర్తనపై అనుమానం కలగడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
సుఫారీ గ్యాంగ్ సభ్యులు సుమన్‌ను బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో లావణ్య, ఆమె ప్రియుడు సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment