ప్రమాదకరంగా మారిన రోడ్డు ప్రయాణం.. పట్టించుకోని పాలకులు, అధికారులు
నారాయణఖేడ్, ఏప్రిల్ 4: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఐఎం నాయకుడు, న్యాయవాది మొహీద్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాగల్గిడ్డ, సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండలాలతో పాటు పరిసర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఈ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల గురించి మాట్లాడే నాయకులు, అభివృద్ధి పనుల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
అలాగే మోర్గి బ్రిడ్జ్ నిర్మాణం ఎన్నాళ్లుగానో అపూర్ణంగా ఉండటం పట్ల కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకాలం గడిచినా పనులు పూర్తికాకపోవడం వెనుక కారణాలేమిటని నిలదీశారు.
ఇప్పటికైనా సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యే, అలాగే నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మొహీద్ పటేల్ డిమాండ్ చేశారు.

Post a Comment