క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృత స్థాయి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యాసంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ క్షేత్రాలు తదితరాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి” అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, వాటిపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
మొదటగా అనంతోగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, గ్రామంలో మంజూరైన 19 ఇళ్లలో ప్రస్తుతం 3 ఇళ్లు రూఫ్ స్థాయికి చేరుకున్నట్లు అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారు గలిగ నాగలక్ష్మి ఇంటి నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పనుల నాణ్యత, వినియోగిస్తున్న సామాగ్రి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హ కుటుంబానికి నాణ్యమైన గృహం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకుని, బయాలజీ వంటి విషయాల్లో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ సమస్యల నేపథ్యంలో ఇన్వర్టర్ ఏర్పాటు ద్వారా సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆళ్లపల్లి గ్రామంలో రైతు మద్దెల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించిన కలెక్టర్, సాగు విధానం, దిగుబడి, ఆదాయం వంటి అంశాలపై రైతుతో చర్చించారు. ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. మండలంలో 400 ఎకరాల లక్ష్యానికి గాను 290 ఎకరాల్లో సాగు పూర్తయిందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్, మందుల గది తదితరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, వాటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 108 అంబులెన్స్ సేవలను కూడా పరిశీలించి అత్యవసర సేవలపై వివరాలు సేకరించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. “క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలి” అని మరోసారి స్పష్టం చేశారు.
మండలంలోని త్రాగునీటి పరిస్థితిపై విచారించిన కలెక్టర్, మిషన్ భగీరథ ద్వారా సరఫరా సక్రమంగా కొనసాగుతున్నప్పటికీ, ఎండాకాలంలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, లేకపోతే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫాగింగ్ యంత్రాల వినియోగంపై కూడా సమీక్షించారు. మొబైల్ సిగ్నల్ సమస్యలపై విచారించగా కొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
వ్యవసాయ రంగంపై సమీక్షలో భాగంగా మండలంలో సాగు అవుతున్న పంటల వివరాలు తెలుసుకుని, నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, బోర్ల ద్వారా సాగునీటి అందుబాటుపై అధికారులను ప్రశ్నించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి ప్రతి మహిళను సంఘాల్లో సభ్యురాలిగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల పురోగతిని కూడా సమీక్షించారు.
విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించకపోవడం, ఆహార నాణ్యత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, అన్ని పాఠశాలల్లో నిరంతర తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంఈఓ శాంతారావును ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు.
త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్, ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Post a Comment