ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

 

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.

ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి, ఆసుపత్రుల్లో కొనసాగుతున్న నిర్మాణాలు, మరమ్మత్తుల పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి పరిస్థితిపై సూపరింటెండెంట్ల నుండి వివరాలు తెలుసుకుని, సిబ్బంది కొరత, వైద్యుల లభ్యత వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, పేద ప్రజలు ప్రభుత్వ వైద్యసంస్థలపై విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవ సేవలపై సమీక్ష నిర్వహించి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు తగిన శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సికిల్ సెల్ అనీమియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.