డిజిటల్ సాంకేతికతతో అంగన్‌వాడీ సేవలకు ఊతం మంత్రి దానసరి అనసూయ (సీతక్క)
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10: అంగన్‌వాడీ సేవలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణలు మంత్రికి స్వాగతం పలికారు.
మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ సేవల్లో డిజిటల్ విధానాల అమలు ద్వారా పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలిపారు. పిల్లల పోషకాహారం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య వివరాలను సులభంగా నమోదు చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని చెప్పారు.
స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఓపెన్ టెండర్ ద్వారా ఒక్కో ఫోన్‌ను ₹11,650కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రజల డబ్బు ఆదా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 12 వేల భవనాల మంజూరు, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు. సిబ్బంది వేతనాల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా సుమారు 15 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 1954 మంది అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం 2061 కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయని, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment