మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు జైలు శిక్ష

మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు జైలు శిక్ష


కొత్తగూడెం: మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన నాచబోయిన ప్రశాంత్, 2016 ఏప్రిల్ 22న జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2016 ఏప్రిల్ 21 రాత్రి తన తల్లిదండ్రులు నాచబోయిన వెంకన్న, లలిత ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, పాల్వంచకు చెందిన నందిగామ పవన్ కుమార్ తన మహీంద్రా కారు (TS 04 EJ 999)ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఇంట్లోకి దూసుకెళ్లాడు.

ఈ ప్రమాదంలో నాచబోయిన లలిత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారు ప్రమాదానికి ముందు సుమారు 100 గజాల దూరంలో మాచినపేటకు చెందిన లాకావత్ సాయికుమార్, బోడా అశోక్ కుమార్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ (AP 24 AL 1262)ను ఢీకొనడంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్ కానిస్టేబుల్ కే. రామదాస్ కేసు నమోదు చేశారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు మొత్తం 14 మంది సాక్షులను విచారించింది.

విచారణ అనంతరం నిందితుడు నందిగామ పవన్ కుమార్‌ను దోషిగా నిర్ధారించి, 1 సంవత్సరం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బి. విశ్వశాంతి వాదించారు. కోర్టు నోడల్ అధికారి ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు పీసీ ఉపేందర్ రావు సహకరించారు.

Blogger ఆధారితం.