ఈద్ మిలాఫ్ కార్యక్రమం ఐక్యత, మానవతా విలువలకు ప్రతీక
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ 5 ఇంక్లైన్ గ్రూప్ మైన్స్‌లో నిర్వహించిన ఈద్ మిలాఫ్ కార్యక్రమం ఐక్యత, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ షాలేం రాజ్ మాట్లాడుతూ, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కరేనని, ఆయన మనందరికీ గాలి, నీరు, ఆహారం సమానంగా అందిస్తున్నాడని అన్నారు. అయితే మనుషులే మతాల పేరుతో విభేదాలు సృష్టిస్తూ “నా దేవుడు గొప్ప” అని చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
నిజంగా దైవాన్ని నమ్మే వారు ఎప్పుడూ సాటి మనిషిని బాధ పెట్టకూడదని, కులమతాలకు అతీతంగా మనమంతా ఒక్కటిగా జీవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులుగా మనం ఐక్యతను పాటిస్తూ, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. “నేను మాత్రమే సుఖంగా ఉండాలి” అనే భావనను విడిచిపెట్టి “మనమంతా బాగుండాలి” అనే ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు.
మరో అతిథి ముస్లిం మత పెద్ద షేఖ్ అబ్దుల్ బాసిత్ రంజాన్ మాసం విశిష్టతను వివరించారు. మంచి మానవతా విలువలతో, తల్లిదండ్రులు మరియు పొరుగువారిపట్ల ప్రేమాభిమానాలతో జీవించడమే నిజమైన భక్తి అని అన్నారు.
గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, నీతి, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడమే అసలైన భక్తి అని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పరం గౌరవించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గని వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్, ఇతర అధికారులు, కార్మిక నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కార్మికులు అందరికీ తీయని సేమీయాలు పంచి ఈద్ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

Post a Comment