గంజాయిపై ఉక్కుపాదం.. 385 కిలోల గంజాయి స్వాధీనం.. రూ.2 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత

గంజాయిపై ఉక్కుపాదం.. 385 కిలోల గంజాయి స్వాధీనం.. రూ.2 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 385 కిలోల గంజాయిని పట్టుకోగా, దీని విలువ సుమారు రూ.2 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక కారు, ఒక లారీని సీజ్ చేయడంతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న కారులో 85 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 212 కేసులు నమోదు కాగా, 15,398 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే 677 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.77 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

అంతేకాకుండా గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో గంజాయి సేవిస్తున్న పదిమందిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు లేదా మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ మొత్తంలో గంజాయి పట్టివేతలో కీలక పాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

Blogger ఆధారితం.