క్రీడలను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

క్రీడలను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాలబాలికలు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : నాగ సీతారాములు


కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. త్రీ ఇంక్లైన్‌లోని తెలంగాణ క్రీడామైదానంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెదపాటి కాశీ హుస్సేన్ అధ్యక్షతన ఈ శిబిరం నిర్వహిస్తున్నారు.


శిబిరంలో పాల్గొంటున్న సుమారు 50 మంది బాలబాలికలకు వివిధ కేటగిరీలలో రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగ సీతారాములు, కొత్తగూడెం నగర మేయర్ మూద్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, జిల్లా క్రీడాధికారి ఎం. పరంధామ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు.

అనంతరం గంటపాటు జరిగిన పోటీలలో ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా క్రీడాకారులకు అవసరమైన శిక్షణ సామగ్రిని అందిస్తున్నట్లు తెలిపారు. బాలబాలికలు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో త్రీ ఇంక్లైన్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం ప్రవళిక, ఉపసర్పంచ్ పాల్తీయ లక్ష్మి, జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గుగులోతు కృష్ణ, బోడ గణేష్, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.