బయటకు రావద్దు.. 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు.. ఏపీకి రెడ్ అలర్ట్..!!

బయటకు రావద్దు.. 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు.. ఏపీకి రెడ్ అలర్ట్..!!


ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, గురువారం కొన్ని జిల్లాల్లో 50 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

తదుపరి ఐదు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు, తీవ్రమైన వడగాడ్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల్లో పలుచోట్ల 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు.

అలాగే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 310 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 147 మండలాల్లో వడగాడ్పులు వీచనున్నట్లు పేర్కొన్నారు.

కోస్తాంధ్ర జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించారు.

ప్రజలకు సూచనలు:

  • మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలి
  • తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి
  • పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
  • ఎండలో ఎక్కువసేపు పనిచేయకూడదు
  • తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలి

వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.