మహిళా సాధికారతలో చారిత్రాత్మక ఘట్టం – రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన

మహిళా సాధికారతలో చారిత్రాత్మక ఘట్టం – రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో మహిళా సాధికారతకు మరో కీలక అడుగు పడింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళల అభివృద్ధే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత బలోపేతం కల్పించేందుకు బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. మహిళలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ముందుకు వచ్చి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.

2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు.

జిల్లా స్థాయిలో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. జిల్లాలో 321 వివో భవనాలకు ప్రభుత్వం మంజూరు ఇవ్వగా, ప్రస్తుతం 222 భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు.

భవనాల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనాలు కేంద్ర బిందువులుగా మారి, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.