లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో మహిళ అనుమానాస్పద మృతి

 

జూబ్లీహిల్స్‌లో విషాదం.. లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో మహిళ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ లేడీస్ హాస్టల్ టెర్రస్‌పై బాత్‌రూమ్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ ప్రాంతానికి చెందిన ఇడుపల్లి హరిత (36) ఉపాధి నిమిత్తం దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె మెహందీతో పాటు ఇతర పనులు చేస్తూ మధురానగర్‌లోని భార్గవి లేడీస్ హాస్టల్‌లో నివసిస్తోంది. హాస్టల్ భవనం పైభాగంలోని టెర్రస్ వద్ద ఆమె ఉండేదని సమాచారం.

మృతురాలు థైరాయిడ్ సమస్యతో పాటు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హాస్టల్ టెర్రస్‌పై ఉన్న బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడంతో హాస్టల్ యజమాని అక్కడికి వెళ్లి చూడగా హరిత విగతజీవిగా కనిపించింది. వెంటనే మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె తల వెనుక భాగంలో గాయం ఉన్నట్లు గుర్తించారు. అనారోగ్యంతో బాత్‌రూమ్‌లో కాలు జారి పడటంతో తలకు బలమైన గాయం అయి మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

టెర్రస్ ప్రాంతానికి ఎక్కువగా ఎవరూ రాకపోవడంతో రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ ఘటన బయటపడలేదని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.