ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, క్రీడా ప్రోత్సాహం లక్ష్యంగా జిల్లా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించిన కార్యక్రమాల ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం ఐడిఓసి కార్యాలయంలో పాల్గొని పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో 04-05-2026న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన 105 మంది యువతీ యువకులకు జిల్లా కలెక్టర్ ప్రొవిజినల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి యువతే బలమైన శక్తి అని, యువత పురోగతి రాష్ట్ర ప్రగతికి పునాది వంటిదని పేర్కొన్నారు.
అనంతరం సీఎం కప్ – 2026తో పాటు ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, సమ్మర్ క్యాంపుల్లో విశేష ప్రతిభ ప్రదర్శించిన యువతకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా యువత ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా టూరిజం శాఖ రూపొందించిన **“తెలంగాణ టూరిజం బ్రాండ్ కిట్ – తెలంగాణ జరూర్ ఆనా”**ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక విశేషాలు, పర్యాటక ప్రాంతాల ప్రచారానికి ఈ బ్రాండ్ కిట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
జిల్లా యువతకు టూరిజం శాఖ అందిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ”, “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సుల వివరాలను కూడా కలెక్టర్ వెల్లడించారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాలను వినియోగించుకొని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. కోర్సులకు సంబంధించిన వివరాల కోసం కో-ఆర్డినేటర్ డా. పి. నాగరాజును 9849905722, 9849905723 నంబర్ల ద్వారా లేదా archaeologydht@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి, జీఎం డీఐసీ మధుసూదన్ రెడ్డి, పీఐఓ పృథ్వి, ప్రశాంతి నగర్ సర్పంచ్ లైలా, విద్యాసంస్థల ప్రతినిధులు, క్రీడా కోచ్‌లు, యువజన శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment