కొత్తగూడెంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

 

కొత్తగూడెంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ బ్యాడ్మింటన్ క్లబ్‌లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సమయస్ఫూర్తి, ఏకాగ్రత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో యువత అవుట్‌డోర్ గేమ్స్‌తో పాటు ఇండోర్ గేమ్స్‌కూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు ఆరోగ్యవంతమైన జీవనశైలికి దోహదపడటమే కాకుండా పోటీతత్వాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, ట్రెజరర్ కె. రమేష్, ప్రోగ్రామ్ చైర్మన్ గోనేల నాని, కమిటీ సభ్యులు రాజ్ కుమార్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు కరీంపాషా, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు జయప్రకాశ్, ఓబీసీ జిల్లా కార్యదర్శి బొబ్బాల వెంకట్ యాదవ్‌తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల ద్వారా స్థానిక క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభించనుండగా, క్రీడా రంగ అభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Blogger ఆధారితం.