ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె తాత్కాలిక వాయిదా
ప్రజారోగ్య మరియు వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రకటించిన ఒక్కరోజు టోకెన్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ – 3194 నాయకులు తెలిపారు.
ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని, GO Ms No: 38 ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని, MPHA(E) ఉద్యోగులకు LHV శిక్షణ అందించకపోవడం వల్ల నిలిచిపోయిన ఇంక్రిమెంట్ల సమస్యను పరిష్కరించాలని యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే SSP-1, SSP-2 ఇంక్రిమెంట్ల మంజూరు, 104 మంది ఉద్యోగుల పెండింగ్ వేతనాల విడుదల, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు, MPHA(A) ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రమోషన్ ప్రక్రియలు పూర్తి చేయాలని కోరింది.
అదనంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమ్మె నిర్వహించాలని యూనియన్ ముందుగా నిర్ణయించింది. ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు సంబంధిత అధికారులకు 14-05-2026న సమ్మె నోటీసు అందజేసినట్లు నాయకులు పేర్కొన్నారు.
అయితే అదనపు కార్మికశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం – ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, పలు అంశాలపై సానుకూల పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో 28-05-2026న నిర్వహించాల్సిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్-3194 రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పొంది వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పోడాని శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎ. ఉమాదేవి తెలిపారు.

Post a Comment