అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

 

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులు కలెక్టర్‌కు వివరాలు తెలియజేస్తూ ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని సుజాతనగర్‌లోని రైస్ మిల్లుకు రెండు రోజులలోపు తరలించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే వర్షపు నీరు ధాన్యం నిల్వల ప్రాంతాలకు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, రవాణా పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీఓ ప్రేమ్ కుమార్, డీఎం సతీష్, చుంచుపల్లి తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.