ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లపై ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 26 (తెలంగాణ పత్రిక): ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో)లకు వినతిపత్రం సమర్పించినట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయకుమార్ తెలిపారు. ఈ వినతిపత్రాన్ని ఆయన ఆధ్వర్యంలో అసోసియేట్ జనరల్ సెక్రటరీ పట్నం సామంత్ సమర్పించారు.
భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, కొంతమంది నర్సులు మరియు సిబ్బంది రోగులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి చిన్న పనికీ డబ్బులు డిమాండ్ చేస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మణుగూరు ఏరియా ఆసుపత్రిలో “మామూల్” ఇవ్వకపోతే యూరిన్ పైపు కూడా పెట్టరని, ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లేందుకు సైతం డబ్బులు అడుగుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ థియేటర్లలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, ఆసుపత్రులలో పరిశుభ్రత కూడా దయనీయంగా మారిందన్నారు. వార్డులు, మరుగుదొడ్లు శుభ్రంగా లేక రోగులకు ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే ఆహారం నాణ్యతలేనిదిగా ఉందని, అవసరమైన మందులు అందుబాటులో లేక పేద రోగులు బయట మెడికల్ షాపులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన వారి భౌతిక కాయాలను తరలించేందుకు సరైన అంబులెన్స్ సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అక్రమ వసూళ్లపై విజిలెన్స్ విచారణ జరపాలని, రోగులతో దురుసుగా ప్రవర్తించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డా. మారెల్లి విజయకుమార్ డిమాండ్ చేశారు.
అలాగే ఆసుపత్రుల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, మందుల లభ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి పేద ప్రజలకు గౌరవప్రదమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment