హజ్ యాత్ర ఎకేశ్వరవాదం, మానవ సమానత్వానికి ప్రతీక : షేఖ్ అబ్దుల్ బాసిత్
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మస్జిద్-ఎ-ఖుబాలో పవిత్ర శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ హజ్ యాత్ర ఎకేశ్వరవాదం, మానవ సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందని పేర్కొన్నారు.
సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులంతా కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంత భేదాలు లేకుండా ఒక్కటేనని హజ్ యాత్ర సందేశమిస్తుందని ఆయన తెలిపారు.
ఇస్లాం మానవ సమానత్వాన్ని బోధిస్తుందని, ధనం, హోదా, అధికార అహంకారాలను విడిచిపెట్టి ప్రేమ, సహనం, త్యాగం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని హజ్ యాత్ర ద్వారా తెలియజేస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతోనే ఇస్లాంలో హజ్ యాత్రను తప్పనిసరి చేసినట్లు వివరించారు.
హజ్ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన హాజీలు తమ చుట్టూ ఉన్న అసమానతలను తొలగిస్తూ, సమాజంలో మంచిని పెంపొందించి చెడును నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరారు. దైవభీతి ఆధారంగా సత్ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మసీదు ఇమామ్ మౌలానా మజ్హార్, సోను బాయ్, మదార్ సాహెబ్, తాజుద్దీన్, రఫీ, షబ్బీర్ హుస్సేన్, ఉమర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment