ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

 

జహీరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

జహీరాబాద్‌, మే 6: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణ పరిధిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని తుల్జాభవానీ ఆలయ దర్శనం ముగించుకుని హైదరాబాద్ వైపు వస్తున్న కారు, పస్తాపూర్ గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో ఓవర్‌లోడ్‌తో ఉన్న ట్రక్కు వెనక్కి జారడంతో టాటా ఏస్ వాహనం కొంత దూరం వెనక్కి వెళ్లింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు టాటా ఏస్ ట్రాలీని ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రరూపం దాల్చింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మైలాపూర్ రోహిత్‌ (16), కాసుల మహేశ్‌గౌడ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందారు. నంపల్లి కార్తీక్‌ (27), కె. నర్సింహులు (32), జితేంద్ర సాయి (9)తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై వినయ్‌కుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకారం, మృతులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.