చండ్రుగొండ పీహెచ్‌సీపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ

 

చండ్రుగొండ పీహెచ్‌సీపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలను సందర్శించిన కలెక్టర్, రోగులతో నేరుగా మాట్లాడి సేవల నాణ్యత, వైద్యుల అందుబాటు, మందుల సరఫరా పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఆసుపత్రి రిజిస్టర్లు, సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించి, డాక్టర్లు, నర్సులు మరియు ఖాళీ పోస్టులపై సమాచారం సేకరించారు. మందుల నిల్వ గదిని తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రక్తపరీక్షలు మరియు ఇతర నిర్ధారణ సేవలపై కూడా ఆరా తీసిన కలెక్టర్, ల్యాబ్ పరికరాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రసూతి విభాగాన్ని పరిశీలించి గర్భిణీలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. హోమియో వైద్యశాలలో డాక్టర్ లేనందున ఆ పోస్టును త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో మెడికల్ అధికారి రాము, తాసిల్దార్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.