ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా “సమగ్ర సంక్షేమ కార్డు” (యూనిఫైడ్ కార్డ్) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు.
సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. ఈ డేటాను కృత్రిమ మేధస్సు (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు జారీ చేసే విధానానికి బదులుగా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియలో వినియోగించాలని చెప్పారు.
ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని సూచించారు. అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయాలని చెప్పారు.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలని ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలను కూడా సేకరించాలని ఐటీ శాఖకు సూచించారు.
ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ వ్యవస్థ ఉండాలని, ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం వెంటనే చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో అనుసంధానించాలని తెలిపారు.
కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment