ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.. వైద్య సేవలపై ఆరా

 

ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.. వైద్య సేవలపై ఆరా

ఆళ్లపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

తనిఖీల సమయంలో మెడికల్ అధికారి తరుణ్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఎందుకు లేరని సిబ్బందిని ప్రశ్నించి వివరణ కోరారు. సంబంధిత శాఖ అధికారులను పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

అనంతరం సిబ్బంది హాజరు పట్టికలు, రిజిస్టర్‌లను పరిశీలించిన కలెక్టర్ ప్రతి ఉద్యోగి విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన సిబ్బంది సెలవుల వివరాలు, డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారం తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు.

అవుట్ పేషెంట్ విభాగం, పరీక్షల గది, మందుల నిల్వ గది, ఇన్ పేషెంట్ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వడదెబ్బతో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యేకంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, మందులు, పర్యవేక్షణ అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, పడకలు అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.

రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని తెలిపారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.