అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

 

అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అందుతున్న ప్రజా సేవలు, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కార స్థితిని స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భూ భారతి, సాదా బైనామా, భూ సర్వేలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ కిషోర్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, సేవలందింపులో జాప్యం చోటుచేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం అశ్వారావుపేట మండలంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ధాన్యం సేకరణ, రవాణా, నిల్వల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి రైతులకు సకాలంలో సహకారం అందించాలని అధికారులకు తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వినతులను తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను సానుకూల దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, సమయపాలనతో కూడిన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

Blogger ఆధారితం.