జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శుక్రవారం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పరిశీలించారు. గత రాత్రి కురిసిన వర్షాల నేపథ్యంలో మొక్కజొన్న నిల్వల పరిస్థితిని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడంతో మొక్కజొన్నకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కేంద్రంలో నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలను, నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం కేంద్రంలో 3,600 మొక్కజొన్న బస్తాలు ఉండగా, ఈరోజే మొత్తం లోడింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సుమారు 28 వేల మొక్కజొన్న బస్తాలను గోదాములకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్నను సకాలంలో గోదాములకు తరలించాలని సూచించారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment