RG ఏరియా పర్యటనలో సింగరేణి సీఎండీని తప్పుదోవ పట్టించిన అధికారులు..?
RG ఏరియా పర్యటనలో సింగరేణి సీఎండీని తప్పుదోవ పట్టించిన అధికారులు..?
ప్రైవేట్ హాస్పిటల్ పేరు, లోగోతో కార్డియాక్ సెంటర్ ప్రారంభంపై విమర్శలు
సింగరేణి సంస్థ RG-1 ఏరియాలో జరిగిన పర్యటన సందర్భంగా సింగరేణి సీఎండీని అధికారులు తప్పుదోవ పట్టించారని HMS అనుబంధ కార్మిక సంఘం ASMEWU-HMS తీవ్ర ఆరోపణలు చేసింది. సింగరేణికి సంబంధించిన క్వాత్ ల్యాబ్ సెంటర్‌లో ప్రైవేట్ హాస్పిటల్‌కు చెందిన పేరు, లోగో ఉండటం వివాదాస్పదంగా మారింది.
“సింగరేణి రెనే కార్డియాక్ కేర్ సెంటర్” పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్ అయిన “రేనే హాస్పిటల్” పేరు, లోగో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు దానిని గుర్తించకుండా సీఎండీ చేత ప్రారంభింపజేయడం సరికాదని సంఘం నాయకులు విమర్శించారు.
ఈ సందర్భంగా HMS నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి పేరుతో నడిచే వైద్య కేంద్రంలో ప్రైవేట్ సంస్థల బ్రాండింగ్ ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. “రేనే హాస్పిటల్” పేరు, లోగో RG-1 అధికారులకు కనిపించలేదా..? దీనికి సంబంధించి జనరల్ మేనేజర్ (GM) ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
సింగరేణి సీఎండీ గారిని అధికారులు తప్పుదోవ పట్టించారని, ఇలాంటి అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని HMS డిమాండ్ చేసింది. అలాగే కార్డియాక్ సెంటర్ పేరును తక్షణమే మార్చాలని కోరింది.
ప్రభుత్వ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ ప్రచారం జరగడం సరైంది కాదని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ASMEWU-HMS నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సింగరేణి కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment