జూన్ 17 నుంచి ముహర్రం మాసం ప్రారంభం – ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చైతన్యానికి పిలుపు
జూన్ 17 నుంచి ముహర్రం మాసం ప్రారంభం – ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చైతన్యానికి పిలుపు
గోదావరిఖని, జూన్ 16: ఇస్లామిక్ నూతన సంవత్సరానికి నాంది పలికే పవిత్రమైన ముహర్రం మాసం జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీ లైబ్రరీలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య అతిథిగా పాల్గొని ముహర్రం మాసం ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత గౌరవప్రదమైన నెల అని పేర్కొన్నారు. "ముహర్రం" అనే పదానికి "గౌరవప్రదమైనది" అనే అర్థం ఉందని, ఈ మాసం మనసును పరిశుద్ధం చేసుకొని దైవచింతన, సత్ప్రవర్తన, ఆత్మపరిశీలనతో జీవితాన్ని మలుచుకునే ఆధ్యాత్మిక వసంతకాలమని తెలిపారు.
ఇస్లామిక్ నూతన సంవత్సరం కేవలం ఉత్సాహాలకు ప్రతీక కాకుండా, సత్యం, ధర్మం, త్యాగం, సహనానికి గుర్తుగా నిలుస్తుందని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి మదీనాకు చేసిన పవిత్ర హిజ్రత్ ప్రయాణంతోనే హిజ్రీ శకం ప్రారంభమైందని గుర్తుచేశారు. సత్య స్థాపన కోసం చేసిన ఆ మహోన్నత త్యాగం మానవాళికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ముహర్రం ఉపవాసాల విశిష్టత
రమజాన్ మాసం అనంతరం అల్లాహ్ దృష్టిలో అత్యంత శ్రేష్ఠమైన ఉపవాసాలు ముహర్రం మాసంలోని ఉపవాసాలేనని ప్రవక్త ముహమ్మద్ (స) బోధించినట్లు ఇస్మాయిల్ నిజామీ వివరించారు. ఉపవాసం అనేది అల్లాహ్ కోసం చేసే ప్రత్యేక ఆరాధనగా పేర్కొంటూ, ఒక రోజు ఉపవాసం ఉన్న వ్యక్తిని అల్లాహ్ నరకాగ్నికి ఎంతో దూరంగా ఉంచుతాడని హదీస్‌లలో ప్రస్తావించబడిందన్నారు.
ఆషూరా దినం ప్రత్యేకత
ముహర్రం మాసంలోని 10వ రోజైన ఆషూరా అత్యంత పవిత్రమైన రోజుగా ముస్లింలు భావిస్తారని తెలిపారు. ఈ రోజున అల్లాహ్ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) మరియు ఆయన అనుచరులను ఫిరౌన్ దౌర్జన్యాల నుంచి రక్షించిన మహత్తర సంఘటనను స్మరించుకుంటారని చెప్పారు.
ఆషూరా ఉపవాసం గడిచిన ఏడాది చిన్నపాటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా నిలుస్తుందని ప్రవక్త ముహమ్మద్ (స) బోధించారని పేర్కొన్నారు. అందువల్ల ముస్లింలు ముహర్రం 9, 10 లేదా 10, 11 తేదీలలో ఉపవాసాలు ఉండాలని సూచించారు.
ప్రేమ, కరుణ, మానవత్వానికి ముహర్రం సందేశం
ముహర్రం మాసం మనకు ద్వేషం, కోపం, అసహనాన్ని విడిచిపెట్టి ప్రేమ, కరుణ, సత్యం, మానవత్వం వంటి విలువలను ఆచరించాలనే సందేశాన్ని అందిస్తుందని ఇస్మాయిల్ నిజామీ అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అల్లాహ్‌పై విశ్వాసం ఉంచితే ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షుడు జావిద్ అక్మల్ హుస్సేనీ, సిరాజుద్దీన్, మక్సూద్ అహ్మద్ ఖాన్, మునవ్వరుద్దీన్, ఖమ్రుద్దీన్, దస్తగీర్, ఇనాముల్ హక్, మహబూబ్ పాషా, ఇబ్రహీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముహర్రం మాసం ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యంపై చర్చించి, ఉపవాసాలు మరియు సత్కార్యాల ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు.

Post a Comment