కొత్తగూడెం బాబు క్యాంప్‌లో యువకుల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి
చుంచుపల్లి, జూన్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికుల్లో భయాందోళనలకు కారణమైంది. గ్రామంలోని రామాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో రెండు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారి సమక్షంలోనే యువకులు ఘర్షణ కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే, ఇంత పెద్ద స్థాయిలో ఘర్షణ జరిగినప్పటికీ ఈ విషయం తమ దృష్టికి ఇప్పటివరకు రాలేదని పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఘర్షణ సమయంలో పోలీసులు అక్కడ ఉన్నట్లు చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల సమక్షంలోనే ఓ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకుని, "ఇదంతా మేమే చూసుకుంటాం.. మీరు వెళ్లండి" అంటూ పోలీసులకు సూచించడంతో, పోలీసులు ఈ వ్యవహారాన్ని సున్నితంగా తీసుకుని వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై పోలీసుల చర్యల పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల బాధ్యత అని, తరచూ జరుగుతున్న గొడవలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు.
ఘర్షణలో ఓ యువకుడు గాయపడినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో చుంచుపల్లి మండలంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. పోలీసు శాఖ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment