కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

 

కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్

కాగజ్‌నగర్, జూన్ 15: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ నిర్వహణ, భద్రతా చర్యలు, పెండింగ్ కేసుల పురోగతిపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, లాకప్ రూమ్, రిసెప్షన్ విభాగం, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, స్టోర్ రూమ్, స్టేషన్ రికార్డులు, హాజరు రిజిస్టర్‌తో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు స్థితిని ఎస్పీ నిశితంగా పరిశీలించారు. కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం రూరల్ ఎస్ఐ సందీప్ కుమార్‌తో పాటు స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, గ్రామీణ ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల విక్రయాలు వంటి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు అండగా నిలిచి వారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులు, భద్రతా అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి, కేసుల విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.

అలాగే, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో ప్యాట్రోలింగ్, పికెటింగ్ విధులను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులు, నేరాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు.

ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువై, సమర్థవంతమైన పోలీసింగ్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.