మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం.. గన్స్‌, రూ.24 లక్షల నగదు సీజ్

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం.. గన్స్‌, రూ.24 లక్షల నగదు సీజ్

 
మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం.. గన్స్‌, రూ.24 లక్షల నగదు సీజ్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలపై భద్రతా బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆపరేషన్లు కీలక ఫలితాలను ఇస్తున్నాయి. నారాయణ్‌పూర్ జిల్లాలోని టెక్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపట్టాయి.

హై అలర్ట్‌తో అటవీ ప్రాంతాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టి జల్లెడ పట్టిన భద్రతా బలగాలు భూమి కింద అత్యంత రహస్యంగా దాచిపెట్టిన భారీ డంప్‌ను గుర్తించాయి. అనంతరం దానిని తెరిచి పరిశీలించగా పెద్ద మొత్తంలో అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

అధికారుల వివరాల ప్రకారం, డంప్‌లో మావోయిస్టులు తమ కార్యకలాపాలకు ఉపయోగించే గన్స్‌, పేలుడు పదార్థాలతో పాటు ఎలాంటి ఆధారాలు లేని రూ.24 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణకు వినియోగించే నిధులుగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో టెక్లా అటవీ ప్రాంతంతో పాటు పరిసర అడవుల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి రహస్య ఆయుధ నిల్వలు ఉన్నాయా అనే కోణంలో డాగ్ స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్ల సహాయంతో గాలింపు చర్యలను అధికారులు మరింత ముమ్మరం చేశారు.

మావోయిస్టుల ఆయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడంలో ఈ భారీ డంప్ స్వాధీనం కీలక విజయంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.