భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం

 

భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం

భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం

భద్రాచలం, జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో శనివారం తెల్లవారుజామున భద్రాచలం పోలీసులు విస్తృత స్థాయిలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని డీఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేస్తూ, స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందాలని ప్రజలకు సూచించారు. ఈ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నీఫర్ డాగ్ పాల్గొన్నారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.