జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
 జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పనుల స్థితిగతులపై ఆరా తీశారు.

సమీక్ష సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జూన్ నాటికి పూర్తికావాల్సిన పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి, జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పినపాక నియోజకవర్గ రైతులే సీతారామ ఎత్తిపోతల పథకం కోసం తొలుత భూములు అందించారని గుర్తుచేసిన మంత్రి, ప్రాజెక్టు ద్వారా మొదటగా పినపాక ప్రాంత రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సాగునీటి వసతుల విస్తరణ ద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలంటే మరో రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చొరవతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.4 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో భూసేకరణ, కాలువల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే 38 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని విస్తారమైన ఆయకట్టుకు సాగునీరు అందించగలమని వివరించారు.

అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి, సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువను ప్రారంభ స్థానం నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. కాలువల్లో మట్టి పేరుకుపోయిన ప్రాంతాలు, జారిపోయిన గట్లు లేదా ఇతర అవరోధాలను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలానికి ముందే కాలువలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా నిర్వహణ పనులను వేగవంతం చేసి, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి సంధ్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.