పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1: పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి తన బాధ్యతగా భావించి ఇందులో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పిలుపునిచ్చారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 1 నుంచి 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేలా ఉండాలని, ప్రతి గ్రామం, విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయం ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. వనమహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గత రెండేళ్లుగా ఒక్క ఎకరం పోడు భూమి కూడా నరికివేయకుండా సంరక్షించగలిగామని చెప్పారు. పచ్చదన పరిరక్షణలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బందికి విధుల నిర్వహణలో ఉపయోగపడే సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చేపట్టనున్న కార్యక్రమాలు జిల్లాలో పచ్చదన విస్తరణకు దోహదపడనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment