ఇస్లాంలో పర్యావరణ పరిరక్షణ కూడా ఆరాధనే: షేఖ్ అబ్దుల్ బాసిత్
ఇస్లాంలో పర్యావరణ పరిరక్షణ కూడా ఆరాధనే: షేఖ్ అబ్దుల్ బాసిత్
చుంచుపల్లి, జూన్ 5: పర్యావరణ పరిరక్షణ ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక బాధ్యత అని, ప్రకృతి సంరక్షణ కూడా ఆరాధనలో భాగమేనని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మస్జిద్-ఎ-ఖుబాలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన మాట్లాడారు.
సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విశ్వాన్ని మానవ మనుగడకు అనుకూలంగా, సమతుల్యంగా సృష్టించాడని, ఆ సమతుల్యతకు భంగం కలగకుండా ప్రకృతి వనరులను అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని పవిత్ర ఖురాన్ బోధిస్తుందని తెలిపారు. 1450 సంవత్సరాల క్రితమే పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత అని, ఏ విషయంలోనైనా అతిగా వ్యవహరించడం అనర్థాలకు దారితీస్తుందని ప్రవక్త ముహమ్మద్ హెచ్చరించారని గుర్తు చేశారు.
ప్రవహించే నది ఒడ్డున ఉన్నప్పటికీ నీటిని వృథా చేయరాదని, పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని ఇస్లాం బోధిస్తుందని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలకు ఇస్లాం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.
భూమిపై ఒక మొక్క నాటితే అల్లాహ్ స్వర్గంలో ఒక మొక్కను నాటుతాడని, మనం పెంచిన చెట్ల వల్ల జీవరాశులు ఎంతకాలం ప్రయోజనం పొందుతాయో అంతకాలం వాటిని నాటిన వ్యక్తికి పుణ్యఫలం లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ పేర్కొన్నారని చెప్పారు. ప్రళయం సమీపిస్తున్నా చేతిలో ఉన్న మొక్కను నాటాలని చెప్పడం ద్వారా చెట్ల పెంపకానికి ఇస్లాం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థమవుతుందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. రాబోయే తరాలకు మనం అందించగలిగే అత్యుత్తమ బహుమతి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణమని అన్నారు.
అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే నేడు కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా, ప్రతి రోజూ పాటించాల్సిన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మసీదు ఇమామ్ మౌలానా మజ్హార్, సోను బాయ్, మదార్ సాహెబ్, తాజుద్దీన్, రఫీ, షబ్బీర్, ఉమర్, ఖలీల్ అహ్మద్, షుకూర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment