ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్

అన్నపురెడ్డిపల్లి, జూన్ 10: ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం సందర్భంగా బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని గ్రామసభకు వివరించారు.

గ్రామసభలో మాట్లాడిన కలెక్టర్ అంకిత్, మూడు దశాబ్దాల క్రితం గ్రామాల్లో సరైన రహదారులు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేకపోయినా ప్రస్తుతం ప్రతి గ్రామంలో రహదారులు, తాగునీటి సదుపాయాలు, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల సహకారంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని చెప్పారు. జూన్ 6 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు పంటల ఎంపికపై సూచనలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పంట మార్పిడి విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించాలని కోరారు. గత సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలిగించిన పీఆర్-126 వరి రకం సాగును నివారించి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.

పారిశుద్ధ్య చర్యలపై ఆదేశాలు

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీల శుభ్రత, ఆయిల్ బాల్స్ వినియోగం, నిల్వ నీటి తొలగింపు వంటి చర్యల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లు, బడిబాటపై ప్రత్యేక దృష్టి

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు మంజూరు చేస్తామని, అర్హత ఉన్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి అర్హులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిందని, అన్నపురెడ్డిపల్లి మండలానికి మూడు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్లు తెలిపారు.

ఓటరు జాబితా సవరణకు సహకరించాలి

పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇంటింటికి వచ్చే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) అడిగే వివరాలను సక్రమంగా అందించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.

అనంతరం గ్రామసభకు హాజరైన ప్రజలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, మండల వ్యవసాయ అధికారి అనూష, ఇతర మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.