బాల్యం బానిస కాదు.. బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం బాల కార్మిక వ్యవస్థపై హృదయాలను కదిలించే కవిత
బాల్యం బానిస కాదు.. బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం బాల కార్మిక వ్యవస్థపై హృదయాలను కదిలించే కవిత
పిల్లలు పాఠశాలల్లో చదువుకుంటూ, ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదించాల్సిన వయసులో కొందరు బాలలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించడం సమాజానికి ఆందోళన కలిగించే అంశమని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆమె రచించిన "బాల్యం బానిస కాదు" కవిత సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
"పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో బరువైన ఇటుకల మోత ఎందుకు? ఆడుకోవాల్సిన ఆ వయసులో చాయ్ కప్పుల మోత ఎందుకు?" అంటూ ప్రారంభమయ్యే ఈ కవితలో బాల కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను హృదయానికి హత్తుకునేలా వివరించారు.
పెన్సిల్, పెన్ను పట్టాల్సిన చిన్నారుల చేతులు తట్టలు, పారలు మోయడం, పుస్తకాల పేజీలు తాకాల్సిన వయసులో ఫ్యాక్టరీల్లో కష్టపడాల్సి రావడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చెమటపై నిర్మించిన భవిష్యత్తు నిజమైన అభివృద్ధి కాదని, బాలల కన్నీళ్లు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయని కవిత ద్వారా సందేశం ఇచ్చారు.
బాల్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల కార్మికత్వాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, స్వేచ్ఛతో కూడిన బాల్యాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని ఆమె కోరారు.
రచయిత: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. :::

Post a Comment