ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
సీసీ కెమెరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించిన ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ గ్రామసభలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూలూరుపాడులోని ఎల్లంకి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ పాటించడం అత్యంత ముఖ్యమని అన్నారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ధరించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ వంటి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకురావాలని కోరారు.
ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకపోయినా వాహనదారులు నియమ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌లోడింగ్ వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. దొంగతనాలు, గొడవలు వంటి ఘటనల్లో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి గ్రామం భద్రత కోసం సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
సైబర్ నేరాలపై కూడా ఎస్పీ ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చదువుకున్నవారే ఎక్కువగా ఈ నేరాలకు గురవుతున్నారని తెలిపారు. ఓటీపీ ట్రాప్‌లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనపై మాట్లాడుతూ, ప్రభుత్వ నిషేధిత గంజాయి సరఫరా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సహకారం అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేర రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంను తీర్చిదిద్దగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, మోటార్ వాహనాల అధికారి వెంకటరమణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment