తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

 

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12: రైతులకు సాగునీరు ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు ప్రాంతాలకు సాగునీటి సరఫరా అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం, చర్ల మండలం పెద్దమిడిసిలేరు వద్ద నిర్మించిన తాళిపేరు ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతోంది. ఇందులో భాగంగా తాళిపేరు ఎడమ కాలువ 46.46 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉండగా, దాని పరిధిలోని 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు సక్రమంగా అందించేందుకు కాలువల నిర్వహణను మరింత పటిష్టంగా చేపట్టాలని సూచించారు. కాలువలో పెరిగిన గడ్డి, పేరుకుపోయిన చెత్త, మురుగు వంటి వాటిని తక్షణమే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, కాలువలో దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆయకట్టు చివరి ప్రాంతాల్లోని రైతులకు కూడా సమానంగా సాగునీరు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో దుమ్ముగూడెం తహసీల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ శాఖ ఈఈ జానీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.