యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

టేకులపల్లి మండలంలోని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ (యూరియా) బుకింగ్ యాప్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

యూరియాను అధికంగా వినియోగించడం వల్ల భూసార నాణ్యత తగ్గిపోతుందని, భవిష్యత్తులో మరింత ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు జరిగిందని పేర్కొన్న కలెక్టర్, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 123 7157 సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. గత సీజన్‌లో మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు.

ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ముఖ్యమైన చర్య అని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

అనంతరం యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా యూరియా బస్తాలను అందజేశారు.

అలాగే టేకులపల్లి పర్యటనలో భాగంగా ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పురోగతిని తెలుసుకుని, నాణ్యతతో పాటు వేగవంతంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.