ప్రజల అభిప్రాయంతోనే రోడ్డు విస్తరణ చేపట్టాలి: ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్
ప్రజల అభిప్రాయంతోనే రోడ్డు విస్తరణ చేపట్టాలి: ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్
నారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపాదిత రెండు వైపులా 50 అడుగుల రోడ్డు విస్తరణను ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే అమలు చేయాలని ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ డిమాండ్ చేశారు.
రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోయే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంపీ, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తుంటే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టివేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుని వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో బైపాస్ రహదారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సమస్యను పరిష్కరించకుండా రెండు వైపులా 50 అడుగుల రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇళ్లను, దుకాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డును అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే నారాయణఖేడ్ ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని మొహీద్ పటేల్ అభిప్రాయపడ్డారు. అలాగే నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-161బి) పూర్తయిన తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్య దాదాపు ఉండదని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ సమస్యను త్వరలోనే ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని మొహీద్ పటేల్ వెల్లడించారు.

Post a Comment