హైదరాబాద్‌లో విషాదం.. టాటా ఏస్ వాహనం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాదం.. టాటా ఏస్ వాహనం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాదం.. టాటా ఏస్ వాహనం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలోని బోలక్‌పూర్లో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల వివరాల ప్రకారం, కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికుల ప్రకారం, బోలక్‌పూర్ నివాస ప్రాంతంలో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాలని గతంలో పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యమే మరోసారి ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాద ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.