ఏండ్లు గడుస్తున్నా కుర్చీ వదలట్లే.. సింగరేణిలో దశాబ్దాలుగా తిష్ట వేసిన అధికారులు!

ఏండ్లు గడుస్తున్నా కుర్చీ వదలట్లే.. సింగరేణిలో దశాబ్దాలుగా తిష్ట వేసిన అధికారులు!

 ఏండ్లు గడుస్తున్నా కుర్చీ వదలట్లే.. సింగరేణిలో దశాబ్దాలుగా తిష్ట వేసిన అధికారులు!

హెచ్‌.ఎం.ఎస్ జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ఆరోపణలు – కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని/హైదరాబాద్/న్యూఢిల్లీ, జూన్ 19: సింగరేణి సంస్థలో కొందరు అధికారులు పదేళ్లకు పైగా ఒకే ఏరియాలో కొనసాగుతూ బదిలీలకు దూరంగా ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని హింద్ మజ్దూర్ సభ (హెచ్‌.ఎం.ఎస్) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ అన్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న కీలక పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులు తమ పలుకుబడి, లాబీయింగ్‌తో బదిలీలను తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

సాధారణంగా మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సేవ పూర్తయిన అధికారులను ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు బదిలీ చేయాల్సి ఉండగా, ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న విభాగాల్లో పనిచేసే అధికారులను రెండేళ్ల నుంచి మూడేళ్ల వ్యవధిలోనే మార్చాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ నిబంధనలు కొందరు అధికారుల విషయంలో అమలుకావడం లేదని విమర్శించారు.

“మాకు పైస్థాయి ఆశీస్సులు ఉన్నాయి.. మమ్మల్ని ఎవరూ కదిలించలేరు” అంటూ కొందరు అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని, అదనపు జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఎస్‌ఈలు, డీవైఎస్‌ఈలు, జేఈలు, సెక్యూరిటీ అధికారులు, డీవైజీఎంలు, జేఆర్డీవో స్థాయి అధికారులు పదేళ్లకు పైగా ఒకే ప్రాంతాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

ఇల్లెందు సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి దాదాపు ఎనిమిదేళ్లుగా అదే ఏరియాలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఏరియా స్టోర్‌లో జరిగిన భారీ కాపర్ చోరీ కేసులో విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇదే కేసులో ఇతర ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్న యాజమాన్యం, సంబంధిత అధికారిపై మాత్రం మౌనం పాటించడం వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నించారు.

అలాగే కార్పొరేట్ సివిల్, ఆర్సీహెచ్‌పీలు, విజిలెన్స్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, పర్చేస్, సివిల్, వర్క్‌షాప్, ట్రాన్స్‌పోర్ట్, మైనింగ్, ఫైనాన్స్ వంటి కీలక విభాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీహెచ్‌పీలో ఓ ఎస్‌ఈ స్థాయి అధికారి సుమారు 12 ఏళ్లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు.

దశాబ్దాలుగా ఒకే ఏరియాలో, ముఖ్యంగా కీలక ఫోకల్ పాయింట్లలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో సింగరేణి విజిలెన్స్ విభాగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న తప్పిదాలకే కార్మికులపై కఠినంగా వ్యవహరించే విజిలెన్స్ అధికారులు, ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో కొనసాగుతున్న అధికారుల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.

సింగరేణిలో దీర్ఘకాలంగా ఒకే ఏరియాలో కొనసాగుతున్న అధికారుల పూర్తి వివరాలను సమీక్షించి, నిబంధనల ప్రకారం తక్షణ బదిలీలు చేపట్టాలని, అవసరమైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హెచ్‌.ఎం.ఎస్ కేంద్ర కమిటీ నాయకులు డైరెక్టర్ (పర్సనల్), సీఎండీకి విజ్ఞప్తి చేశారు. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు.

Blogger ఆధారితం.