టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

 

టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి – సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వివిధ సమస్యలతో స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

జిల్లాలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్న ఎస్పీ, ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అలాగే మట్కా, జూదం, కోడి పందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలు మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు సూచించాలని ఆదేశించారు.

అదేవిధంగా, పెట్రోలింగ్ మరియు బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ సత్యనారాయణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు రాజేందర్, శ్రీనివాసరెడ్డి, సోమేశ్వర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.