విద్యార్థులకు నాణ్యమైన ఆహారం – రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22: విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
సోమవారం బూర్గంపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాల మరియు మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, రైతులకు ఎరువుల లభ్యతపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదట తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు. కిచెన్‌లో వంటల తయారీ విధానాన్ని పరిశీలించిన ఆమె, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించడాన్ని నిర్ధారించుకోవాలని అధికారులకు సూచించారు.
వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెనూ అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారమే ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని ఆరా తీశారు.
అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని, ఆహార పదార్థాల నిల్వ మరియు వినియోగంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, విద్య, వసతి, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు, హాజరు శాతం, బోధనా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులతో చర్చించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తగినంతగా అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పత్తి విత్తనాల ప్యాకెట్లు, వివిధ రకాల ఎరువులు, పురుగుల మందుల నిల్వలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
గోదాములో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను తనిఖీ చేసిన కలెక్టర్, నిల్వల పరిస్థితిని సమీక్షించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు.
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందించడంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిల్వలు, విక్రయాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ సీజన్‌లో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో బూర్గంపాడు తహసీల్దార్ కె.ఆర్.కె.వి. ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో జమ్మలరెడ్డి, ఎంపీవో, కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి శంకర్, హౌసింగ్ ఏడీ, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment