అనుమానంతో భార్యను వేధించి ఆమె మరణానికి కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

 

అనుమానంతో భార్యను వేధించి ఆమె మరణానికి కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

అనుమానంతో భార్యను వేధించి ఆమె మరణానికి కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

కొత్తగూడెం, జూన్ 22: భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించిన భర్తకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు కొత్తగూడెంలోని మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీమతి కర్నాటి కవిత సోమవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం, పాల్వంచ రూరల్ మండలం మందేరికలపాడు గ్రామానికి చెందిన వజ్జ కృష్ణ కుమార్తె మిల్కా ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం సూర్యతండాకు చెందిన అజ్మీర్ మోహన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

వివాహం జరిగిన నాటి నుంచి అజ్మీర్ మోహన్ తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ దూషించడం, కొట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2022 ఫిబ్రవరి 7న మిల్కా పురుగుల మందు సేవించినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తన కుమార్తెను భర్త నిరంతరం మానసికంగా, శారీరకంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ వజ్జ కృష్ణ 2022 ఫిబ్రవరి 8న లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ డి. హారిక కేసు నమోదు చేయగా, అనంతరం ఎస్‌ఐ జె. ప్రవీణ్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా కోర్టు మొత్తం 10 మంది సాక్షులను పరిశీలించింది. సాక్షుల వాంగ్మూలాలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం అజ్మీర్ మోహన్‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498(A) కింద భార్యను వేధించిన నేరం రుజువైందని నిర్ధారించింది. దీంతో అతనికి మూడేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.

అయితే ఐపీసీ సెక్షన్ 306 కింద ఉన్న ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగం విషయంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసు నుంచి నిందితుడికి విముక్తి కల్పించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ అధికారి ఎస్‌ఐ డి. రాఘవయ్య, కోర్టు లైజన్ అధికారి ఎం. శ్రీనివాస్ (కోర్టు డ్యూటీ ఆఫీసర్), పీసీ సిలువేరు అశోక్ కేసు నిర్వహణలో సహకరించారు.

Blogger ఆధారితం.