కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యం: కాపు సీతాలక్ష్మి
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యం: కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురావేశారు.
రామవరం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద జెండా ఎగురావేసిన అనంతరం, టూ ఇంక్లైన్ ఏరియాలోని రామవరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, అణచివేతలు, నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి, 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు పాలన సాగించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిందని ఆమె పేర్కొన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం కేసీఆర్ కలల తెలంగాణను దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, భవిష్యత్తులో మళ్లీ గులాబీ జెండా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ, గడప రాజయ్య, హుస్సేన్, మోరే పార్వతి, విజయలక్ష్మి, మాజీ గౌస్, చంద్రయ్య, సూరిబాబు, సురేందర్, అశోక్, రాచపల్లి శ్రీను, ఖాజా బక్ష్, నగేష్, అన్వర్ ఖాజా, షమ్మీ, రాజేందర్, పూర్ణచంద్రరావు, లచ్చిరాం, మనోజ్, పాషా, రాజేష్, కిరణ్, సాగర్, కొయ్యడ శ్రీనివాస్ ప్రసాద్, అమన్, షణ్ముఖ్, షోహల్, చాణక్య ప్రసాద్, ప్రభాకర్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment