గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్

గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్
 గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్

24 గంటల్లో పూర్తిస్థాయి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశం – ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృత పర్యటన నిర్వహించి పాఠశాలల పరిస్థితులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, ఆవరణను పరిశీలించిన కలెక్టర్ పలు లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్‌లో లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. నాలుగు నెలల క్రితం ఇదే అంశంపై సూచనలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కంప్యూటర్ ఇన్‌స్పెక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు.

అనంతరం వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందించాల్సిన ఆహారం ప్రభుత్వ మెనూ ప్రకారం లేదని గుర్తించారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని హాస్టల్ వార్డెన్‌కు స్పష్టం చేశారు. వసతి గృహాల్లో కూడా పరిశుభ్రత లోపాలను గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమైన కలెక్టర్, ప్రధానోపాధ్యాయుని గది మినహా పాఠశాలలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల తదితర ప్రాంతాల్లో 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్ వార్డెన్‌కు మెమో జారీ చేయాలని సూచించారు.

తర్వాత కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజన నాణ్యత, హాజరు నమోదుపై వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల చేరిన విద్యార్థుల వివరాలను పరిశీలించి, హాజరు నమోదును యాప్ ద్వారా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ సక్రమంగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అనంతరం ఎలకలగూడెం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే విధానం, దరఖాస్తుల పరిశీలన, యాప్‌లో వివరాల నమోదు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వివరాలను నమోదు చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఒక్క కుటుంబం కూడా సర్వేకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాప్‌లో నమోదు చేసే వివరాలు ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నమోదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ధృవీకరించాలని సూచించారు.

సర్వే పురోగతిపై ఎంపీడీవో వివరాలు వెల్లడిస్తూ, అశ్వాపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 3,448 దరఖాస్తులు ఎల్-1 స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వాటిలో ఇప్పటివరకు 2,075 దరఖాస్తుల సర్వే పూర్తయ్యిందని, మండలంలో 409 గుడిసెలను గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన దరఖాస్తుల సర్వేను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో అశ్వాపురం ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.