ఓలా ఎలక్ట్రిక్ షోరూం ముట్టడి.. సర్వీసింగ్ సదుపాయం లేదంటూ వినియోగదారుల ఆగ్రహం

ఓలా ఎలక్ట్రిక్ షోరూం ముట్టడి.. సర్వీసింగ్ సదుపాయం లేదంటూ వినియోగదారుల ఆగ్రహం
 హైదరాబాద్‌లో ఓలా ఎలక్ట్రిక్ షోరూం ముట్టడి.. సర్వీసింగ్ సదుపాయం లేదంటూ వినియోగదారుల ఆగ్రహం

హైదరాబాద్‌లోని నేరేడుమెట్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంను ఆదివారం పలువురు వాహనదారులు ముట్టడించారు. స్కూటర్లకు సరైన సర్వీసింగ్ సదుపాయం లేకపోవడం, సాంకేతిక సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. షోరూం యాజమాన్యం వాహనాల అమ్మకాలపైనే దృష్టి పెట్టి, కొనుగోలు చేసిన వినియోగదారుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ, సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక లోపాలు తరచూ ఎదురవుతున్నాయని తెలిపారు.

సమస్యలను పరిష్కరించేందుకు నేరేడుమెట్ షోరూంకు వస్తే, ఇక్కడ కేవలం వాహనాల విక్రయాలు మాత్రమే జరుగుతాయని, సర్వీసింగ్ సదుపాయం లేదని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిబంధనలను పాటించకుండా వినియోగదారులకు తగిన సేవలు అందించని షోరూంల లైసెన్సులను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం షోరూం యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వాహనదారులు తమ ఆందోళనను విరమించారు.

Blogger ఆధారితం.