భర్త ఆత్మహత్య కేసులో భార్య సహా ఐదుగురికి జైలు శిక్ష కొత్తగూడెం కోర్టు కీలక తీర్పు

భర్త ఆత్మహత్య కేసులో భార్య సహా ఐదుగురికి జైలు శిక్ష కొత్తగూడెం కోర్టు కీలక తీర్పు

భర్త ఆత్మహత్య కేసులో భార్య సహా ఐదుగురికి జైలు శిక్ష కొత్తగూడెం కోర్టు కీలక తీర్పు 

మానసిక వేధింపులే ఆత్మహత్యకు కారణమని నిర్ధారణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య కేసులో భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై నేరం రుజువుకావడంతో కొత్తగూడెం కోర్టు జైలు శిక్షలు విధించింది. ఈ మేరకు కొత్తగూడెం మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీమతి కర్నాటి కవిత బుధవారం సంచలన తీర్పును వెలువరించారు.

కేసు వివరాల ప్రకారం, అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన తోగరం ముత్యాలరావు 2014లో నారాయణపురం గ్రామానికి చెందిన తోగరం శ్యామలను వివాహం చేసుకున్నాడు. ముత్యాలరావు స్థానిక ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే, శ్యామలకు తోగరం కోటేశ్వరరావుతో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయాన్ని ముత్యాలరావు పలుమార్లు గుర్తించి వారిని మందలించాడని మృతుడి తల్లి తోగరం తిరుపతమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం శ్యామలను ఆమె తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లగా, ఈ వివాదంపై నారాయణపురంలో పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి.

ఈ పంచాయతీల సమయంలో ముత్యాలరావును అవమానపరిచే విధంగా దూషించారని, మానసికంగా తీవ్రంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 జూలై 31న అశ్వరావుపేటలోని ఒక మామిడి తోటలో ముత్యాలరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తన భార్య శ్యామలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను మానసికంగా వేధించారని, బెదిరింపులకు గురిచేశారని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై మృతుడి తల్లి 2018 ఆగస్టు 1న అశ్వరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్. మధు ప్రసాద్ దర్యాప్తు చేపట్టి మొత్తం 12 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగగా, ప్రాసిక్యూషన్ తరఫున 13 మంది సాక్షులను విచారించారు.

సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు, సూసైడ్ నోట్ తదితర ఆధారాలను పరిశీలించిన కోర్టు ఐదుగురిపై నేరం రుజువైందని నిర్ధారించింది. దీంతో తోగరం శ్యామలకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, తోగరం వెంకటేశ్వరరావుకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, తోగరం రామారావుకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, తోగరం పుల్లారావుకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, తోగరం నరసమ్మకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

అదే సమయంలో మిగిలిన నిందితులపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసు నుంచి విముక్తి కల్పించింది. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ బి. నాగేశ్వరరావు కేసు నిర్వహణలో కీలక సహకారం అందించారు. ఈ తీర్పు కుటుంబ వివాదాలు, మానసిక వేధింపులు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని, ఆత్మహత్యకు ప్రేరేపించే చర్యలను న్యాయస్థానాలు ఎంత తీవ్రంగా పరిగణిస్తాయో మరోసారి స్పష్టం చేసింది.

Blogger ఆధారితం.